రాజన్న సిరిసిల్ల: మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించి, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణ, జలాశయాలు, చెరువుల పరిస్థితుల పర్యవేక్షణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల వేగవంతం, చేయూత పెన్షన్లకు అవసరమైన ధ్రువపత్రాల జారీ, వరదల సమయంలో చేపట్టాల్సిన అప్రమత్తత చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎంపీడీఓలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని, అన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును జాప్యం లేకుండా పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్షలో డీఆర్ఓ జయశ్రీ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కేఎస్బీ కుమారి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

