ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంజూరు చేయించిన నిధులకు, పనులకే కాంగ్రెస్ మంత్రులు మళ్లీ శంకుస్థాపనలు చేయడం ‘మంది పైసలకు మంగళహారతులు’ పట్టినట్లు ఉందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఘాటుగా విమర్శించారు.
గురువారం వనపర్తిలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహంలో వారు ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్లే ఖిల్లా ఘనపూర్ మండలం వెంకటాంపల్లికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడు సిద్ధి రాము అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు.
ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల్లో కేంద్ర నిధులు రూ.1.50 లక్షలు, పంచాయతీ నిధులు రూ.1.20 లక్షలు పోతే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రూ.2.30 లక్షలేనని, ఇది ఇంటి నిర్మాణానికి ఏ మూలకు సరిపోదని విమర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇళ్ల నిధులను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సిద్ధి రాము మృతికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంతాపం తెలిపారు.
● పాత పనులకే కొత్త శంకుస్థాపనలు
గతంలో కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఐటీ టవర్ రూ.22 కోట్లు, పాలిటెక్నిక్ ఆధునీకరణ రూ.13.40 కోట్ల పనులకే మంత్రులు మళ్లీ ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. చేతనైతే మిగిలిపోయిన 10 శాతం రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ హయాంలో అప్పులతో కాళేశ్వరం, సెక్రటేరియట్, కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు కట్టి, రైతుబంధు, ఆసరా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. కాగ్ నివేదిక ప్రకారం బీఆర్‌ఎస్ అప్పు రూ.3.80 లక్షల కోట్లు మాత్రమేనని.. కానీ 7, 8 లక్షల కోట్లు అంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు. దమ్ముంటే ఈ అప్పులపై కేటీఆర్, హరీష్ రావులతో చర్చకు రావాలన్నారు.
కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అభివృద్ధి చూపించాలని హితవు పలికారు.ఈ సమావేశంలో నాయకులు గంధం పరంజ్యోతి, హేమంత్ ముదిరాజ్, జోహెబ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి, సయ్యద్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.

