ఇటీవలే మణుగూరు పీకే ఓసీ-2ను సందర్శించి డిప్ సైడ్ బ్లాక్ వివరాలు తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క(ఫైల్ ఫోటో)
హైదరాబాద్: ప్రజా ప్రభుత్వ కృషితో సింగరేణికి మరో కీలక విజయం దక్కిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సోమవారం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి దక్కించుకోవడం సంస్థ చరిత్రలో ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్క ఈ సందర్భంగా స్పందిస్తూ, ప్రజా ప్రభుత్వంలో సింగరేణి పరిరక్షణ, విస్తరణతో పాటు రాష్ట్ర ఇంధన భద్రతను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గత 30 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి ఫలితంగానే సింగరేణికి వరుస విజయాలు లభిస్తున్నాయని తెలిపారు.
ఇటీవల ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభించడం, తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు సాధించడం తర్వాత నెల రోజుల వ్యవధిలోనే మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణి దక్కించుకోవడం మరో చారిత్రక విజయమని ఆయన అన్నారు.
ఈ బ్లాక్ ద్వారా 20 సంవత్సరాల పాటు ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున మొత్తం 120 మిలియన్ టన్నుల నాణ్యమైన జీ-8 గ్రేడ్ బొగ్గు వెలికితీసే అవకాశం ఉందని భట్టి తెలిపారు. దీంతో తెలంగాణ విద్యుత్ అవసరాలకు దీర్ఘకాలికంగా బొగ్గు సరఫరా భద్రత కల్పించడంతో పాటు మణుగూరు ఏరియాలో సుమారు రెండు వేల మంది కార్మికులకు ఉపాధి భద్రత లభిస్తుందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో సింగరేణి వేలాల్లో పాల్గొనే అవకాశాలను నిరోధించడం వల్ల కీలక బొగ్గు బ్లాక్‌లు ప్రైవేట్ సంస్థలకు వెళ్లాయని విమర్శించిన భట్టి విక్రమార్క, ప్రజా ప్రభుత్వం మాత్రం సింగరేణి ప్రయోజనాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంస్థను మరింత బలోపేతం చేయడం, కొత్త బొగ్గు నిల్వలను సంస్థకు అందించడం, ఉద్యోగ భద్రతను పెంచడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ దక్కించుకోవడంలో కృషి చేసిన సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులను ఉప ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్తులో కోయగూడెం-3, సత్తుపల్లి-3 బొగ్గు బ్లాక్‌లను కూడా సింగరేణికి దక్కేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనుల సాధనతో పాటు క్రిటికల్ మినరల్స్ అన్వేషణలోనూ సింగరేణి విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు.

