గోదావరిఖని : డీ-అడిక్షన్ సెంటర్‌లో ఆటవస్తువుల పంపిణీ.
గంజాయి,ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన బాధితులను తిరిగి సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడం,వారి మానసిక స్థితి, ప్రవర్తనలో సానుకూల మార్పులు తీసుకురావడం లక్ష్యంగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్‌ను పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి,వారికి అందుతున్న వైద్య సేవలు,చికిత్స పురోగతి గురించి వైద్యులు,సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గంజాయి,ఇతర మత్తు పదార్థాల వ్యసనానికి గురైన వ్యక్తులు తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా అవసరమైన వైద్య, మానసిక,సామాజిక సహాయాన్ని అందించేందుకు పోలీసులు,వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
చికిత్స పొందుతున్న బాధితుల కాలక్షేపం, మానసిక ఉల్లాసం, ఆలోచనా విధానంలో సానుకూల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అందించిన క్యారమ్ బోర్డులు,చెస్ బోర్డులు తదితర ఆటవస్తువులను డీసీపీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గంజాయి,ఇతర మత్తు పదార్థాల వ్యసనం నుంచి పూర్తిగా బయటపడేందుకు వైద్య చికిత్సతో పాటు మానసిక ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారం,సమాజం నుంచి నిరంతర మద్దతు కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. వ్యసనానికి గురైన వారిని చిన్నచూపు చూడకుండా,వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

