Friday, August 14, 2026

Buy now

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా

* 4.21 లక్షలకుపైగా నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా
* ప్రమాదవశాత్తు మరణం, వైకల్యానికి రూ.5 లక్షల వరకు బీమా రక్షణ
* మత్స్యకారుల సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్: రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

2026–27 సంవత్సరంలో 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల 4,21,767 మంది నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని మంత్రి పేర్కొన్నారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.79.96 బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియం భరిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లించనుందని, దీంతో అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు.

* బీమా పథకం ద్వారా ప్రయోజనాలు:

* ప్రమాదవశాత్తు మరణం: రూ.5 లక్షలు
* శాశ్వత సంపూర్ణ వైకల్యం: రూ.5 లక్షలు
* శాశ్వత పాక్షిక వైకల్యం: రూ.2.50 లక్షలు
* ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స: గరిష్ఠంగా రూ.25 వేల వరకు వైద్య సహాయం

2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

ప్రమాద సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు, వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో గ్రూప్ ప్రమాద బీమా పథకం కీలకమైనదని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నమోదిత మత్స్యకారులు, వారి కుటుంబాలకు సమగ్ర సామాజిక భద్రత, ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

Related Articles

spot_img

Most Popular