Saturday, August 15, 2026

Buy now

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం: మంత్రి పొన్నం ప్రభాకర్

*వేములవాడ తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన – కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రారంభం

వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

గురువారం వేములవాడ తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వేములవాడ–కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నికల హామీని నిలబెట్టుకుందని తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణంతో తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. 1984లో నిర్మించిన వేములవాడ బస్‌స్టేషన్‌ను రూ.1.62 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు రోజూ సుమారు 250 బస్సులు, 560 ట్రిప్పులు నడుస్తుండగా, రోజుకు దాదాపు 50 వేల మంది ప్రయాణికులు ఈ బస్‌స్టేషన్‌ను వినియోగిస్తున్నారని వివరించారు.

కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభించడంతో పాటు గతంలో ముంబైకి కూడా బస్సు సౌకర్యం కల్పించినట్లు గుర్తుచేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు.

మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 334.11 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.11,668 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,600 కొత్త బస్సులను కొనుగోలు చేశామని, దాదాపు రూ.100 కోట్లతో బస్‌స్టేషన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1,000 కోట్ల పీఎఫ్ బకాయిలు, రూ.600 కోట్ల సీసీఎస్ బకాయిలను చెల్లించినట్లు వెల్లడించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు బస్‌స్టేషన్లను కూడా ఆధునీకరిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సమర్థవంతంగా అందిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అదే అభివృద్ధి దిశగా తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టడం సంతోషకరమని అన్నారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బస్‌స్టేషన్ ఆధునీకరణకు రూ.1.62 కోట్లు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆధునీకరణతో రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ.249.40 కోట్లతో రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ కుమార్, ఎస్పీ మహేష్ బి. గితే, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular