* తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు అన్ని విధాలా సహకారం
* తెలంగాణ–మారిషస్ మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తాం
* మారిషస్ ప్రతినిధి బృందానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ
హైదరాబాద్: మారిషస్‌లో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పురాణ ఇతిహాసాల పరిరక్షణ, ప్రచారానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మంత్రి లచ్మునా రాజ్ పెంటియా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ–మారిషస్ మధ్య సాంస్కృతిక సంబంధాలు, తెలుగు భాష పరిరక్షణ, ప్రవాసాంధ్రుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణ–మారిషస్ మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. ఇరు ప్రాంతాల మధ్య ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ద్వారా తెలంగాణకు మారిషస్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నారు.
మారిషస్ ప్రభుత్వం చేపడుతున్న రామ భజన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విద్య, సాంస్కృతిక పరిశోధన, కళలు, భాషా, సాంస్కృతిక అభివృద్ధి రంగాల్లో అవసరమైన తోడ్పాటు అందిస్తామని తెలిపారు.
మారిషస్‌లోని తెలుగు సమాజం అక్కడి బహుళ సాంస్కృతిక సమాజంలో కీలక భాగంగా ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు తెలంగాణ–మారిషస్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా మారిషస్ మంత్రి లచ్మునా రాజ్ పెంటియా మాట్లాడుతూ, మారిషస్‌లోని తెలుగు కల్చరల్ సెంటర్ ద్వారా లక్షలాది తెలుగు ప్రవాసులు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటున్నారని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను మారిషస్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. తెలుగు భాష, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
తెలంగాణ–మారిషస్ మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు ప్రాంతాలు కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. భవిష్యత్‌లో విద్య, సంస్కృతి, కళలు, భాషా పరిరక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

