# అధికారులు అప్రమత్తంగా బాధ్యతలు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: ఈ నెల 16న ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పురోగతిపై జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది డ్యూటీ పాసులు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. మేడారం వనదేవతల ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, నూతన కలెక్టరేట్, పైలాన్, గట్టమ్మ ఆలయ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మేడారంలో వనదేవతల దర్శనం, తులాభారం, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలతో పాటు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, సభా ప్రాంగణంలో చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.
ప్రతి అధికారికి అప్పగించిన బాధ్యతలపై పూర్తి అవగాహన ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్. మహేందర్ జి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్వో రవికుమార్, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

