* ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప చావు కోరుకోవడం ఏమిటని కల్వకుంట్ల కవిత ప్రశ్న
హైదరాబాద్: ముఖ్యమంత్రే సొంత పార్టీ నేతలను ఉసిగొల్పి గూండాగిరిని ప్రోత్సహిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమవుతుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆమె స్పందించారు.
రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఢీకొట్టాలే తప్ప వారి చావును కోరుకోవడం ఏమిటని కవిత నిలదీశారు. షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నోటి దురుసుతో ప్రత్యర్థి నాయకులు, కులాలు, వ్యవస్థలను దూషించడం ఇదే మొదటిసారి కాదని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దూషణలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా అని నిలదీశారు.
ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి అధికార పార్టీ నాయకులు దండయాత్రకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించిన కవిత.. ముఖ్యమంత్రే తన పార్టీ నాయకులను ఇలాంటి దాడులకు ఉసిగొల్పడం ఆందోళనకరమన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తోందో అర్థం కావడం లేదని విమర్శించారు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలా?
రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 22ఏ నిషేధిత భూముల జాబితా, ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్, యూరియా కొరత, జీవో 97 రద్దు, మహిళల భద్రత, గురుకుల విద్యార్థుల సమస్యలు, పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు వంటి అంశాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ సమయాన్ని వినియోగించాల్సిన సమయంలో రెండు రోజులుగా విలువైన సభా సమయాన్ని రాజకీయాల కోసం వృథా చేశారని విమర్శించారు. ఇకనైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాలని ఆమె కోరారు.
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి:
పోలీస్ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితిని వెంటనే పెంచాలని కవిత డిమాండ్ చేశారు. ఎస్సై పోస్టులకు 38 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 36 ఏళ్ల వరకు వయోపరిమితి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వివిధ జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు మంగళవారం తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కవితను కలిసి తమ సమస్యలను వివరించారు. వయోపరిమితి పెంచకపోవడంతో అనేక మంది పోలీస్ ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిరుద్యోగులకు అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు.నిరుద్యోగుల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారినే మోసం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
20 వేల పోలీస్ పోస్టులు భర్తీ చేయాలి:
రాష్ట్రంలో సుమారు 20 వేల పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 7 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమేనని కవిత విమర్శించారు. మొత్తం 20 వేల పోలీస్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాకు 200 పోస్టులు కూడా లేని పరిస్థితిలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఈ పోస్టులు ఏమాత్రం సరిపోవని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగాల విషయంలో హోంశాఖ ఒకటి చెబుతుంటే ప్రభుత్వం మరోలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా 20 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. నిరుద్యోగుల తరఫున తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

