* హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్, ఇంగ్లిష్‌పై పట్టు ఉన్న వారికి అవకాశం: కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలోని అర్హత కలిగిన యువతకు జపాన్‌లో డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం జపాన్ సంస్థ ప్రతినిధులు, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ (IDTR) ప్రిన్సిపాల్ దురై మురుగన్తో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
అంతకుముందు జపాన్ సంస్థ ప్రతినిధులు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని **ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ (IDTR)**ను సందర్శించి అక్కడ అందిస్తున్న డ్రైవింగ్ శిక్షణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.
హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి అవకాశం
జిల్లాలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, ఇంగ్లిష్ భాషపై పట్టు ఉన్న 25 ఏళ్ల వయసు యువత శిక్షణకు అర్హులని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
అర్హత ఉన్న యువత తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని IDTRను సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో జిల్లా రవాణా శాఖ, IDTR ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన యువతను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ:
ఎంపికైన అభ్యర్థులకు IDTRలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డ్రైవింగ్ శిక్షణ అనంతరం జపాన్ భాషపై కూడా ప్రత్యేక తర్ఫీదు ఇస్తారని పేర్కొన్నారు.శిక్షణలో ఎంపికైన అభ్యర్థులకు జపాన్‌లో డ్రైవర్ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుందని, నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం పొందే అవకాశం ఉందని తెలిపారు.
పూర్తి వివరాలకు సంప్రదించండి
ఉద్యోగ అవకాశాలు, అర్హతలు, శిక్షణ తదితర పూర్తి వివరాల కోసం IDTR ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని 94421 25075 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జపాన్ సంస్థ ప్రతినిధులు ఓసీ బుచి, రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

