Friday, August 14, 2026

Buy now

యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్‌ఆర్టీసీ భరోసా

* రోడ్డు ప్రమాదంలో అంగవైకల్యానికి గురైన డ్రైవర్ కుటుంబానికి రూ.50 లక్షల బీమా సాయం
* కష్టకాలంలో కొండంత అండగా ఆర్టీసీ–యూబీఐ భాగస్వామ్యం: ఎండీ వై. నాగిరెడ్డి

హైదరాబాద్: విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి శాశ్వత అంగవైకల్యానికి గురైన టీజీఎస్‌ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సహకారంతో కొండంత అండగా నిలిచింది. యూబీఐ అందిస్తున్న ఉచిత ప్రమాద బీమా పథకం ద్వారా బాధిత డ్రైవర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.

కరీంనగర్ జిల్లా కోరుట్ల డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎండీ. మదార్ (స్టాఫ్ నంబర్ E323013) గత ఏడాది అక్టోబర్ 9న విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై తన కాలును పూర్తిగా కోల్పోయారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన శాశ్వత అంగవైకల్యానికి గురై మంచానికే పరిమితం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఈ క్లిష్ట సమయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ‘సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్’ బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులు యూబీఐ బ్రాంచీలలో ఖాతాలు తెరిచి రూపే కార్డులు పొందడంతో, ఖాతాకు అనుసంధానమైన ఉచిత ప్రమాద బీమా ప్రయోజనం బాధిత ఉద్యోగికి వర్తించింది.

సోమవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై. నాగిరెడ్డి, యూబీఐ సీజీఎం ఎం. రవీంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్. సత్యనారాయణ బాబ్జిలతో కలిసి రూ.50 లక్షల విలువైన చెక్కును బాధిత డ్రైవర్ మదార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ తప్పు లేకపోయినా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురికావడం అత్యంత విచారకరమన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, ఆపదలో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇలాంటి బీమా పథకాలు అత్యవసర సమయాల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక భద్రతతో పాటు ఆత్మస్థైర్యాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ప్రమాద బీమా పథకం ద్వారా 27 మంది ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందని తెలిపారు. సంస్థ ఉద్యోగులకు విశేష సేవలు అందిస్తున్న యూనియన్ బ్యాంక్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీహెచ్. వెంకన్న, ఎం. రాజశేఖర్, సాలమన్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, సీపీఎం ఉషాదేవితో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

* బాధిత డ్రైవర్ ప్రమాద వివరాలు
కరీంనగర్ జిల్లా కోరుట్ల డిపోకు చెందిన డ్రైవర్ ఎండీ. మదార్ (స్టాఫ్ నంబర్ E323013) 09.10.2025న బస్సు (TS02Z 0040)లో కోరుట్ల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో కుకనూర్‌పల్లి వద్ద బ్రిడ్జిపై నిలిపి ఉంచిన లారీ (TS08UA 4588)ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి తన కాలును పూర్తిగా కోల్పోయారు. శాశ్వత అంగవైకల్యానికి గురై మంచానికే పరిమితం కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక సంక్షోభంలోకి వెళ్లింది.

Related Articles

spot_img

Most Popular