Thursday, July 16, 2026

Buy now

రామగుండం సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కలిసిన ఎమ్మెల్యే :ఎం.ఎస్.రాజ్ ఠాకూర్

* 1×800 మెగావాట్ల బి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్:రామగుండం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అభివృద్ధి అంశాలపై వినతులు సమర్పించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ రామగుండం ప్రాంత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన 1×800 మెగావాట్ల బి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి,నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు రామగుండం ప్రాంత యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది, స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రికి వివరించారు.

అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌ను అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీమ్‌లో చేర్చి నగర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందించాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కోరారు.

రామగుండం కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్గత రహదారుల విస్తరణ, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, తాగునీటి సరఫరా మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సౌకర్యాల కల్పన వంటి అంశాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రామగుండంను ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆదర్శ పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే వినతులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రామగుండం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Related Articles

spot_img

Most Popular