* ‘భవ్య’ పథకం కింద కేంద్రానికి ప్రాజెక్టు నివేదికలు సమర్పిస్తున్నాం: సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ “భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య)” పథకం కింద రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం భవ్య పథకం కింద రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కుల పురోగతిపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చేనేత, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ, భవ్య పథకం తొలి దశలో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న నాలుగు ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు.
ప్రతి పార్కు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్న ఆయన, భూసేకరణతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం మాదారం, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మైలారం ప్రాంతాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ పార్కుల్లో ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని సీఎస్ వెల్లడించారు. వీటితో పాటు రాష్ట్రంలోని మరో 16 ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.

