Sunday, October 4, 2026

Buy now

రెండో రోజుకు చేరిన కాంట్రాక్ట్ కార్మికుల మహా నిరాహార దీక్ష

* హైపవర్ కమిటీ వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలి
* అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్‌కు TCKS కృతజ్ఞతలు

గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం (TCKS) రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. గోదావరిఖని RG-1 జీఎం కార్యాలయం ఎదుట కొనసాగుతున్న ఈ దీక్షకు సింగరేణి పరిధిలోని వివిధ ఏరియాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ (HPC) సిఫార్సు చేసిన వేతనాలను అమలు చేయడంతో పాటు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నిరాహార దీక్ష చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు.

అసెంబ్లీలో ప్రస్తావనపై హర్షం
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను సభ దృష్టికి తీసుకెళ్లడం హర్షణీయమని TCKS నాయకులు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యేకు సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సింగరేణి పరిధిలోని 11 ఏరియాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తి, హైపవర్ కమిటీ వేతనాలు, కార్మిక హక్కుల సాధనకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.

ప్రధాన డిమాండ్లు
సింగరేణి సంస్థలో పర్మినెంట్ కార్మికులతో సమానంగా ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని సంఘం డిమాండ్ చేసింది.హైపవర్ కమిటీ సిఫార్సు చేసిన వేతనాలను కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే అమలు చేయాలి.గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలి.విధి నిర్వహణలో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి.బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా తగిన జీవన భృతి కల్పించాలి.నర్సరీ, పార్కు కార్మికులకు ఉపాధిలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి.కార్మికులందరికీ యాజమాన్యం అధికారిక గుర్తింపు కార్డులు జారీ చేయాలి.PF, ESI, గ్రాట్యుటీ, ప్రమాద బీమా సౌకర్యాలను పకడ్బందీగా అమలు చేయాలి.వివిధ విభాగాల్లో సమస్యలు పరిష్కరించాలి.

సివిల్ విభాగంలోని మేసన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, హెల్పర్ల వేతన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓసీపీ విభాగాల్లో పనిచేస్తున్న వాల్వో డ్రైవర్లు, మైన్ బెల్ట్ క్లీనింగ్ కార్మికులు, బ్లాస్టింగ్ విభాగం సిబ్బందికి సరైన వేతనాలతో పాటు రక్షణ పరికరాలు అందించాలని కోరారు.వైద్య, ఆసుపత్రి విభాగాల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, వార్డ్ బాయ్‌లు, ఆయాలు, శానిటేషన్ కార్మికులకు తగిన వేతనాలు కల్పించాలని, సెక్యూరిటీ సిబ్బందికి వేతన రక్షణ కల్పించాలని సంఘం డిమాండ్ చేసింది.

యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలి:
రాష్ట్రంలోని ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు PRC అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, సింగరేణిలో మాత్రం కాంట్రాక్టర్ల ద్వారా అరకొర వేతనాలు చెల్లిస్తున్నారని TCKS నాయకులు ఆరోపించారు. ‘సమాన పనికి సమాన వేతనం’ సూత్రాన్ని, కార్మిక చట్టాలను అమలు చేయడంలో యాజమాన్యం విఫలమవుతోందని విమర్శించారు.తక్కువ మొత్తాలకు టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్ల కారణంగా కార్మికులకు సరైన వేతనాలు, కనీస సౌకర్యాలు అందడం లేదని పేర్కొన్నారు.

ఐక్యంగా పోరాడాలి
“కాంట్రాక్ట్ కార్మికులు సంస్థకు భారం కాదు.. సింగరేణికి నిజమైన గుండెకాయ బలం. మన హక్కుల కోసం మనమే పోరాడాలి” అని TCKS రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ అన్నారు. ప్రతిరోజూ కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో RG-1 జీఎం కార్యాలయం వద్దకు తరలివచ్చి దీక్షకు మద్దతు తెలిపి ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.“పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప” అని పేర్కొంటూ కార్మికులందరూ ఐక్యతతో ఉద్యమించి తమ హక్కులను సాధించుకోవాలని మద్దెల శ్రీనివాస్ కోరారు.

Related Articles

spot_img

Most Popular