* సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని వేములవాడలో జూలై 30 నుంచి వరుణయాగాలు
వేములవాడ: రైతన్నల సంతోషమే రాష్ట్ర సుభిక్షానికి శ్రీరామరక్ష అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. హనుమాజీపేట, మల్లారం ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నక్కవాగు ఉప్పొంగి ప్రవహించడం, పొలాలు పచ్చని వరి నాట్లతో కళకళలాడుతున్న దృశ్యాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం తొలగిపోయి వరుణుడి కరుణతో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఇటీవల వరకు వెలవెలబోయిన పొలాలు ప్రస్తుతం పచ్చటి వరి నాట్లతో కొత్త శోభను సంతరించుకోవడం రైతుల్లో కొత్త ఆశలు నింపుతోందని చెప్పారు.
హనుమాజీపేట, మల్లారం ప్రాంతాల్లో చేల గట్ల వెంట నడుస్తూ రైతులతో మాట్లాడిన సందర్భంగా వారి ఆశలు, వ్యవసాయంపై ఉన్న విశ్వాసం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. నక్కవాగు కలకలలాడుతూ ప్రవహిస్తుండడం ఈ ప్రాంత రైతులకు శుభసూచకమని పేర్కొన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతుల ఇంట పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ జూలై 30, 31, ఆగస్టు 1 తేదీల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో వరుణయాగాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
చెరువులన్నీ నిండి, పంటలన్నీ సమృద్ధిగా పండాలని, రైతన్న ముఖంలో చిరునవ్వు ఎల్లప్పుడూ నిలవాలని ఆకాంక్షించారు. రైతుల కష్టసుఖాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

