Friday, July 31, 2026

Buy now

రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లపై సీపీ ప్రత్యేక నజర్

* ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు**

వరంగల్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న బ్లాక్ స్పాట్లపై పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం సంబంధిత పోలీసు అధికారులు, నేషనల్ హైవే అథారిటీ, రోడ్డు రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి జాతీయ రహదారి–163లోని హనుమకొండ–హైదరాబాద్ ప్రధాన మార్గంలో ప్రమాదాలకు గురవుతున్న 10కిపైగా బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలను అధికారులతో కలిసి సమగ్రంగా పరిశీలించిన సీపీ, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖలకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామాలకు వెళ్లే అనుసంధాన రహదారులు, డివైడర్ ఓపెనింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో స్పష్టమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రమాదాల ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు, దిశా నిర్దేశక సూచికలు, రిఫ్లెక్టివ్ సైన్ బోర్డులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జాతీయ రహదారి వెంట ఉన్న మద్యం దుకాణాల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పార్కింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశీలన సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన సీపీ, కరుణాపురం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని వచ్చిన విజ్ఞప్తిపై స్పందిస్తూ అవసరమైన ప్రాంతాల్లో పాదచారుల వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు.

అనంతరం జాతీయ రహదారి–163పై ప్రమాద బాధితులను అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను పరిశీలించిన సీపీ, అందులోని వైద్య సౌకర్యాలు, సిబ్బంది స్పందన తీరుపై ఆరా తీశారు. అత్యవసర పరిస్థితుల్లో మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ఘనపూర్ ఏసీపీ భీంశర్మ, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ భరద్వాజ్, మేనేజర్ లింగయ్య, పోలీసు అధికారులు, రోడ్డు రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ, జాతీయ రహదారి అథారిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular