Thursday, July 16, 2026

Buy now

రోళ్ల వాగు ప్రాజెక్టు అటవీ శాఖ అనుమతులు పూర్తి చేస్తాం

*ఈవానకాలం సీజన్ లో రైతులకు సాగునీరు అందజేస్తాం..
*అటవీ శాఖ అనుమతి లేకుండానే ప్రాజెక్టు ప్రారంభించిన బీఆర్ఎస్..
*రోళ్ల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అడ్లూరి..

బీర్ పూర్: జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టు సంబంధించిన అటవీశాఖ అనుమతులు పూర్తి చేసి ఈవాన కాలం సీజన్ లో సాగు నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తోపాటు నీటిపారుదల శాఖ అటవీ శాఖ అధికారులతో కలిసి రోళ్లవాగు ప్రాజెక్టును మంత్రి సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేసే క్రమంలో డీపీఆర్ పూర్తి అయిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం చేస్తారని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టుకు ఏలాంటి డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించారని మంత్రి అడ్లూరి ఆరోపించారు. 2016లో ఏలాంటి అనుమతులు లేకుండా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పనులు ప్రారంభించారని మంత్రి తెలిపారు. రూ. 60 కోట్లతో ప్రారంభించిన రోళ్ల వాగు ప్రాజెక్టు 2023 డిసెంబర్ వరకు రూ. 153 కోట్లకు పెంచారని అన్నారు.

అంచనాలు పెంచినప్పటికీ రోళ్ల వాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేదని మంత్రి ఆరోపించారు. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకున్నారని ధర్మపురి నియోజకవర్గ ప్రాజెక్టులను మాత్రం పెండింగ్ లో పెట్టారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్ల వాగు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి అన్నదాతలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్మాణ సంస్థకు ఇవ్వాల్సిన రూ. 40కోట్లు చెల్లించడంతో పాటు రెవెన్యూకు సంబంధించిన 800 ఎకరాల భూమిని అప్పగించడం జరిగిందని మంత్రి వివరించారు.

రిజర్వు ఫారెస్ట్ అనుమతుల కోసం రూ. 32 లక్షలు డిపాజిట్ చేయడం జరిగిందని మంత్రి వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులతో పాటు అటవీ శాఖ అనుమతులు సాధించి ఈవానకాలంలో సాగునీటిని రైతులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 15 రోజుల్లో ప్రాజెక్టు కు గేట్లు బిగించి పాయింట్.25 టీఎంసీల నీటిని నిలువ చేసి రైతులకు వానకాలం సీజన్ లో సాగు నీటిని అందిస్తామని మంత్రి తెలిపారు.

Related Articles

spot_img

Most Popular