హనుమకొండ (వడ్డెపల్లి):కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS)లో మరో కీలక ముందడుగు పడింది. హనుమకొండ వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలోని సుమారు 30 ఎకరాల విలువైన భూమిని అభివృద్ధి కోసం కుడా ఆధ్వర్యంలో అప్పగించేందుకు భూ యజమానులు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు.
ఈ సందర్భంగా వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ భూ యజమానుల కమిటీ సభ్యులు, ప్రతినిధులు బూర విద్యాసాగర్, ఎం. విజయ్ కుమార్, డి. స్వరాజ్యలక్ష్మి, బూర అశోక్ కుమార్, బల్లెం వెంకటయ్య, రాజేష్, తిరుపతి రెడ్డిలు కుడా కార్యాలయంలో ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డిని కలిసి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల మేరకు భూముల అభివృద్ధికి తమ పూర్తి సమ్మతిని తెలిపారు.
ఈ మేరకు అధికారిక దరఖాస్తులు, భూమి హక్కుల పత్రాలు, అవసరమైన అన్ని సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్ ప్రతులను కుడా అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, నగర సుందరీకరణతో పాటు క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. భూ యజమానుల సహకారంతో ఈ ప్రాజెక్టును వేగవంతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే, ఈ ప్రాజెక్టు పురోగతిపై రాబోయే నాలుగు రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

