రెండున్నరేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్లు మంజూరు చేశాం
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గద్వాల: ప్రజా ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిస్పష్టం చేశారు. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పధకం కింద 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రెండున్నర లక్షల ఇళ్లు, క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లతో కలిపి మొత్తం ఎనిమిది లక్షల ఇళ్లను నిర్మిస్తోందని వివరించారు.
గద్వాల జిల్లాల్లో బుధవారం సహచర మంత్రి వాకీటి శ్రీహరి, స్ధానిక ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణా మోహన్ రెడ్డి కలెక్టర్ రిజవాన్ బాషా షైక్ లతో కలిసి తహశీల్ధార్ కార్యాలయ భవనం, వెంకటేశ్వర ఆలయాలకు మంత్రి పొంగులేటి శంకుస్ధాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పధకం కింద పేదలకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి పొంగులేటి దివంగత నేత రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా తాము ప్రజలను మోసపుచ్చకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.
ఒక్క రూపాయి లంచం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణకార్యక్రమాలు సాగుతున్నాయని గుర్తు చేశారు. తొలి విడత మంజూరు చేసిన ఇళ్లలో ఇప్పటికే 1.35 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు జరిగాయని మరో 1.25 లక్షల ఇళ్లు శ్లాబులను పూర్తి చేసుకోగా మిగిలిన ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. రెండవ విడత ఇళ్ల మంజూరు ప్రతి నియోజకవర్గానికి 1500 ఇళ్లతో పాటు పూరి గుడిసెల స్ధానే పక్కా ఇళ్ల కోసం 500 చొప్పున మంజూరు చేశామని వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈనెల 10 ఖమ్మం జిల్లాలో రైతులకు 9300 కోట్ల రూపాయిల విడుదలకు సంబంధించి కార్యక్రమం జరుగుతుందని నాడు వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ మాటలకు భిన్నంగా నేడు రైతే రాజు అనే నినాదంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

