Thursday, July 16, 2026

Buy now

వనపర్తి ప్రగతి పథం.. కాంగ్రెస్ హయాంలోనే సంక్షేమం

*​ గోపాల్‌పేటలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
​* మార్కెట్ అభివృద్ధికి రూ.7.5 కోట్ల నిధుల విడుదల
*​ నియోజకవర్గంలో 32 వేల కొత్త రేషన్ కార్డుల మంజూరు
​* త్వరలోనే రూ.60 కోట్లతో పాలెం తరహా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు
* ​ప్రతిపక్షాలపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర ధ్వజం

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, రైతులు, మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. గురువారం గోపాల్‌పేట మండల కేంద్రంలోని బుద్ధారం ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.

ఉమ్మడి మండల చైర్మన్‌గా ఎక్కే వెంకటేష్, వైస్ చైర్మన్‌గా సత్యశీలా రెడ్డి, డైరెక్టర్‌గా చంద్రయ్య ప్రమాణ స్వీకారం చేశారు. పొలికేపాడు – బుద్ధారం మధ్య నూతన మార్కెట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. వనపర్తి మార్కెట్ అభివృద్ధి కోసం నిలిచిపోయిన రూ.7.50 కోట్ల నిధులను త్వరలోనే విడుదల చేయిస్తామన్నారు.

​వనపర్తి మార్కెట్ పక్కన సుమారు 25 నుండి 30 ఎకరాల స్థలంలో రూ.60 కోట్ల వ్యయంతో పాలెం తరహాలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు జీవో విడుదలైందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సంఘాల కోసం మూడు రైస్ మిల్లులు, మూడు కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు మంజూరయ్యయన్నారు .

అలాగే బుద్ధారం-బిజినపల్లి ఫోర్ లేన్ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని 340 గుడిసెలను తొలగించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం ద్వారా వనపర్తిని గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చి దిద్దుతామని, నియోజకవర్గంలో కొత్తగా 32 వేల రేషన్ కార్డులను మంజూరు చేశామన్నారు.

పేదలకు సన్న బియ్యం పంపిణీ తో పాటు రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు చేసి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలను విజయవంతంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

​దేవుడి పేరుతో ఓట్లు అడుగుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ధ్వజమెత్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 27వేల కోట్ల బ్యాంకు నిల్వలున్న రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిందని, ఆ అప్పుల వడ్డీలు కట్టడం వల్లే కొన్ని పథకాల అమలులో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు.

పదవులు వచ్చాక ప్రజలకు దూరం కాకుండా, సామాన్యుల మధ్య ఉంటూ నిరంతరం శ్రమించాలని నూతన పాలకవర్గానికి ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు శ్రీనివాస్ గౌడ్, పుల్లా గారు, తిరుపతన్న, సత్యాన్న తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular