* తల్పునూరును నాగర్‌కర్నూల్ జిల్లాలో కలపాలని అఖిలపక్షం రిలే దీక్ష
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: తమ గ్రామాన్ని వనపర్తి జిల్లా నుండి తొలగించి, తిరిగి నాగర్‌కర్నూల్ జిల్లాలో కలపాలంటూ తల్పునూరు గ్రామ ప్రజలు, అఖిలపక్ష కమిటీ నాయకులు రిలే నిరాహార దీక్షకు దిగారు. వనపర్తి జిల్లా కేంద్రం తమ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా, నాగర్‌కర్నూల్ కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. విద్యా, వైద్య అవసరాలతో పాటు, రవాణా సౌకర్యాలు, వ్యవసాయ మార్కెటింగ్, విత్తనాల కొనుగోలు పరంగా కూడా నాగర్‌కర్నూల్‌తోనే తమకు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం, గతంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఉన్న తమ గ్రామాన్ని తిరిగి అదే జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ న్యాయమైన పోరాటాన్ని ప్రారంభించినట్లు గ్రామ కమిటీ స్పష్టం చేసింది.

