◆ తల్పునూరు ప్రజల ఆవేదన.. పరిపాలనా సౌలభ్యం కోసం అఖిలపక్ష దీక్షలు
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : మా చదువు, బతుకూ నాగర్‌కర్నూల్‌లోనే.. కానీ మమ్మల్ని వనపర్తి జిల్లాలో కలపడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాంమని వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాన్ని తిరిగి నాగర్‌కర్నూల్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో గ్రామంలో 52 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామానికి వనపర్తి 30 కి.మీ దూరంలో ఉండడమే సరైన బస్సు, ఆటో సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదే నాగర్‌కర్నూల్ అయితే కేవలం 14-15 కి.మీ దూరంలో ఉండడం వల్ల విద్యా, వైద్య అవసరాలతో పాటు రైతులు తమ పంట ఉత్పత్తుల విక్రయాలకు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అక్కడికే వెళ్తున్నారు. గతంలో తమ ఊరు నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఉండేదని, యువత ఉద్యోగ అవకాశాలకు, ప్రజల రోజువారీ పరిపాలనా సౌలభ్యానికి ఇది ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. సరిహద్దుల సాంకేతికతల కంటే ప్రజల మానవీయ కష్టాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తల్పునూరును నాగర్‌కర్నూల్ జిల్లాలో విలీనం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

