వరంగల్: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) భూముల వేలంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ పాలనలో కుడా భూములు, నిధుల వినియోగంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణలకు ఆదేశించినట్లు తెలిపారు.
కుడా భూముల వేలం పూర్తిగా పారదర్శకంగా, బహిరంగ వేలం (ఓపెన్ ఆక్షన్) ద్వారా నిర్వహించామని, దీంతో సంస్థకు గణనీయమైన ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి బహిరంగ వేలం ఎప్పుడైనా నిర్వహించారా అని ప్రశ్నించారు.
బాలసముద్రంలో సుమారు రూ.150 కోట్ల విలువైన కుడా భూమిని ఆక్రమించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆరోపించారు. అలాగే కాళోజీ కళాక్షేత్రం టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశించామని, అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చనున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ల పాత్రపై విచారణలు ప్రారంభమైనట్లు తెలిపారు. కుడా నిధుల దుర్వినియోగం, వెంచర్ల పేరిట జరిగిన అక్రమ సంపాదనపై విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
భద్రకాళి బండ్–సుచిర్ ఇండియా కాంట్రాక్ట్ కేటాయింపులో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించిన ఆయన, ఆ వ్యవహారంపైనా పూర్తి స్థాయి విచారణ జరుగుతోందన్నారు. అలాగే ఆర్టీసీ ట్రేడింగ్ సెంటర్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లీజుల వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు.
59 జీఓను దుర్వినియోగం చేసి బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను బదిలీ చేసుకున్నారనే ఆరోపణలపై కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ విచారణల్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను వెంట తీసుకురాకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని, గత పదేళ్ల పాలనలో జరిగిన ప్రతి అక్రమం బయటపడుతుందని అన్నారు.
హనుమకొండ, వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భద్రకాళి మాడ వీధుల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు కాలం చెల్లిందని, అన్ని ఆరోపణలకు చట్టబద్ధమైన ఆధారాలతో సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.

