Monday, June 22, 2026

Buy now

వర్షాకాల సన్నద్ధతపై జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
వాటర్ హార్వెస్టింగ్‌ను తప్పనిసరిగా అమలు చేయాలి – మంత్రి

ముఖ్యమంత్రి సూచనల మేరకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ, జిల్లా యంత్రాంగం మరియు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాకాలానికి ముందే సిల్ట్ తొలగింపు పనులను పూర్తిచేసి, నగరంలో నీటి నిల్వలు, రోడ్ల ముంపు వంటి సమస్యలు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మాన్సూన్ కాలంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వెంటనే సహాయం అందించాలన్నారు.

నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్‌ను పరిశుభ్రంగా, హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బస్తీ దవాఖానాల పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

నగరంలో నిర్మించబడుతున్న ప్రతి భవనంలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే విధంగా హార్వెస్టింగ్ వ్యవస్థలను అమలు చేయాలన్నారు. ప్రజలకు ముందుగా అవగాహన కల్పించి, అనంతరం అవసరమైన చోట అమలు చర్యలు చేపడతామని తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలో 25 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, నగరాన్ని మరింత హరిత వాతావరణంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణ మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఫిష్ స్టాల్స్ వంటి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సున్నా వడ్డీ రుణాల సద్వినియోగం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ప్రజాపాలన ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను విస్తరిస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల సహకారం, భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు.

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తాగునీటి వనరులను విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో కృష్ణ ఫేజ్-1, ఫేజ్-2, గోదావరి ఫేజ్-1, ఫేజ్-2 నీటి సరఫరా మాత్రమే ఉండగా, ప్రస్తుతం అదనపు తాగునీటి వనరులను ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు.

నగర జనాభా పెరుగుదలకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని, ఒకేసారి భారీ వర్షాలు కురిసినప్పుడు నీటి పారుదల మెరుగుపడేందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కీలకమని పేర్కొన్నారు.

హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, వాటి వినియోగంపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, పోలీసు, హైడ్రా మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular