కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ సంస్థ పర్యావరణహిత ఇంధన ఉత్పత్తికి మరింత ప్రాధాన్యత ఇస్తోందని సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధ ప్రకాశ్ జ్యోతి తెలిపారు. ఇందులో భాగంగా కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ పరిధిలోని సంస్థ భవనాలపై ఏర్పాటు చేసిన 1.23 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను శుక్రవారం ఆయన ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
సింగరేణి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎండీ మాట్లాడుతూ.. సింగరేణి అంటే బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థగా చాలా కాలంగా గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రస్తుతం చేపడుతున్న వ్యాపార విస్తరణ చర్యలతో థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ రంగాల్లోనూ సంస్థ తనదైన ముద్ర వేస్తోందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బొగ్గు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో పాటు సింగరేణి వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఇప్పటివరకు 245.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా దేశ, రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చేందుకు భవిష్యత్తులో మరిన్ని సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
సింగరేణి సంస్థకు చెందిన భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే కార్పొరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 1.23 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎండీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమలరావు, జీఎం (కోఆర్డినేషన్) తాడబోయిన శ్రీనివాస్, జీఎం (సీపీ&పీ) ఎ. మనోహర్, జీఎం (ఈ&ఎం వర్క్‌షాప్ & ఎనర్జీ మేనేజ్మెంట్) కె. శ్రీనివాసులు, గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ సెక్రటరీ ఎస్.వి. రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం (ఐఎన్టీయూసీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి. త్యాగరాజన్, కార్పొరేట్ సీఎంఓఏఐ ఉపాధ్యక్షుడు కేశవరావు, ఇతర అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

