Friday, August 14, 2026

Buy now

వర్షాలు సమృద్ధిగా కురవాలని మహా వరుణయాగం

* కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు సస్యశ్యామలం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రార్థన
* 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో శాస్త్రోక్తంగా వరుణయాగం

నాగార్జునసాగర్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది.

నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలు ఏర్పాటు చేసి వరుణదేవుని అనుగ్రహం కోసం వైదిక పద్ధతిలో హోమక్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు.

* రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థన

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో మహా వరుణయాగం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

భారతీయ సంస్కృతిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయమని సీఎం అన్నారు. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం ముందుకు సాగుతూనే, వర్షాలు, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది.

“రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళతో కళకళలాడాలి. భూగర్భ జలాలు పెరగాలి. పంటలు పుష్కలంగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలి” అని ముఖ్యమంత్రి వరుణదేవుడిని ప్రార్థించారు.

ఈ పవిత్ర వరుణయాగ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular