* పాత బజారులో నీటి నిల్వలపై ఆరా.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
రామగుండం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పాత బజారు ప్రాంతంలో నీటి నిల్వలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే, వర్షాల కారణంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి నిల్వలను వెంటనే తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించి వర్షపు నీరు వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజలు కూడా వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు.

