మెదక్: మెదక్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ పాల్గొని మొక్క నాటి విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. మొబైల్ వ్యసనం, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
అలాగే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత వివరాలను ఎవరికీ పంచుకోవద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థి దశలో అలవర్చుకునే మంచి అలవాట్లే జీవితాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొంటూ, చదువుతో పాటు విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.”ఈరోజు చేసే కష్టమే.. రేపటి విజయానికి పునాది” అంటూ విద్యార్థులను లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ప్రోత్సహించారు.

