* నీట్ పరీక్షల లీకేజీ, రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్‌పై భగ్గుమన్న నిరసనలు
* పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
పెద్దపల్లి : విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని మూడు నెలల కిందట నీట్ పరీక్ష లీక్ కావడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వరుస పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న తీరును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో బుధవారం కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తమ నిరసనను గట్టిగా చాటారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఆందోళన సమాచారం అందుకున్న ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరేష్ తదితర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకుని పక్కకు తొలగించారు. ఆందోళనకారులను నిలువరించి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మీడియాతో మాట్లాడుతూ దేశంలో గడచిన 12 ఏళ్ల పాలనలో ఏకంగా 12 సార్లు ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, నిరుద్యోగ యువత, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేస్తోందని ధ్వజమెత్తారు. మొన్నటికి మొన్న నీట్ పరీక్ష లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, మానసిక వేదనతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, పదేళ్లలో కోట్లాది మంది యువతను మోసగించిందని విమర్శించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తూ వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం,అక్రమ అరెస్టులకు పాల్పడడం మోడీ ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేని యెడల రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు నూగిల్ల మల్లన్న, బిరుదు రాధాకృష్ణ , వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు మినుపాల ప్రకాష్ రావు, కూర మల్లా రెడ్డి, రామిడి తిరుపతి రెడ్డి, కొమ్ము పోచాలు, సింగిల్ విండో చైర్మన్లు సామ రాజేశ్వర్ రెడ్డి, చిలుక సతీష్, ముత్యాల నరేష్, కళ్లేపల్లి జానీ, మండల పార్టీ అధ్యక్షులు గాజవేన సదయ్య, భూషణవేణ సురేష్ గౌడ్, బూతగడ్డ సంపత్, వేగోలం అబ్బయ్య గౌడ్, మాజీ ఎంపీపీ రాజేందర్, సారయ్య గౌడ్, సయ్యద్ మస్రత్, ఆరే సంతోష్, దాన్నాయక దామోదర్ రావు, ఆడేపూ వెంకటేష్, ఆర్కుట్ సంతోష్, ప్రదీప్, నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

