Thursday, July 16, 2026

Buy now

​విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతనివ్వాలి : కలెక్టర్ కోయ శ్రీ హర్ష

జిల్లాలోని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్ సమీక్ష

పెద్దపల్లి ప్రతినిధి: ​అభ్యసన ఫలితాలు పనితీరు గ్రేడింగ్ సూచికలు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్, సమర్థవంతమైన తరగతి గది బోధనపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

​శనివారం పెద్దపల్లిలోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్‌లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ నాణ్యమైన విద్యలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. విద్యార్థులు స్వతంత్రంగా చదవడం, మాట్లాడడం నేర్చుకున్న అంశాలను సృజనాత్మకంగా వ్యక్తపరిచేలా తీర్చిదిద్దాలని కోరారు.

​ప్రతి పాఠశాలలో వార్షిక విద్యా ప్రణాళిక, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పాఠ్య ప్రణాళికలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి రెమెడియల్ బోధన అందించాలని స్పష్టం చేశారు. డిజిటల్ వనరులు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతి గదుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు.

​విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఆ సమాచారాన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో క్రమం తప్పకుండా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. శాఖ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయుల బోధనా ప్రక్రియను మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు.

​ఈ సమావేశంలో జిల్లా అకాడమిక్ ప్యానల్ తనిఖీ బృంద సభ్యులను కలెక్టర్ పరిచయం చేయగా, హాజరైన ఉపాధ్యాయులకు అకాడమిక్ ప్లానింగ్ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా వ్యాప్తంగా 14 మండలాల నుండి సుమారు వెయ్యి మంది ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. ​ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా విద్యా శాఖా ఏఎంఓ డాక్టర్. పి.ఎం. షేక్, సెక్టోరల్ అధికారులు మల్లేశ్, జిసిడిఓ కవిత, అలోకిట్, ఆర్పీ సమీర్, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular