తంగళ్లపల్లి: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ హైస్కూల్‌ను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మునిగెల రాజు, పాఠశాలలో అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
పాఠశాలల్లో ఉన్న చిన్నచిన్న సమస్యలు, అవసరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొన్నాల లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం, డైరెక్టర్ పరశురాం, కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ల భరత్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కోల శంకర్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

