Sunday, October 4, 2026

Buy now

విధులకు దీర్ఘకాలంగా గైర్హాజరైన ఉద్యోగిపై చర్యలు

* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి : జిల్లాలోని కమాన్‌పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కె.చిరంజీవి 2025 ఫిబ్రవరి 1 నుండి ఎటువంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో, ఆయనపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం తెలిపారు. సంబంధిత ఉద్యోగి దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న విషయాన్ని కమాన్‌పూర్ మండల తహసీల్దార్ 2026 ఏప్రిల్ 25న నివేదించారని తెలిపారు.

అనధికారిక గైర్హాజరుపై వివరణ కోరుతూ జారీ చేసిన మెమోలను స్వీకరించేందుకు కె.చిరంజీవి నిరాకరించడంతో పాటు, ఫోన్ ద్వారా సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలకు కూడా స్పందించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఉద్యోగిపై తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నివేదించినట్లు తెలిపారు. తదనంతరం 2026 మే 2న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా కె. చిరంజీవిని సర్వీసు నుండి సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్, 1991లోని సంబంధిత నిబంధనల ప్రకారం కె. చిరంజీవిపై సర్వీసు నుండి తొలగింపు శిక్ష విధించేందుకు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ప్రతిపాదిత శిక్షను ఎందుకు విధించకూడదో, అందుకు గల సరైన, సముచితమైన కారణాలతో కూడిన లిఖితపూర్వక వివరణను షోకాజ్ నోటీసు అందుకున్న తేదీ నుండి 15 రోజుల్లోగా సమర్పించాలని సంబంధిత ఉద్యోగిని కోరినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

నిర్ణీత గడువులోగా ఎటువంటి వివరణ సమర్పించని పక్షంలో, సంబంధిత ఉద్యోగికి సమర్పించేందుకు ఎటువంటి వివరణ లేదని భావించి, రికార్డులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిబంధనల ప్రకారం ప్రతిపాదిత శిక్షను విధించేందుకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular