రాజన్న సిరిసిల్ల: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కార్ఖానాను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్, ఆయన సతీమణిని పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు.
సూక్ష్మ మగ్గంపై పీతాంబరం, అగ్గిపెట్టెలో పట్టే చీరలు, ఉంగరం, దబ్బనంలో పట్టే చేనేత వస్త్రాలు, అలాగే జీ-20 సదస్సు ఉద్దేశాన్ని ప్రతిబింబించే ప్రత్యేక వస్త్రాలు, వివిధ దేశాధినేతల చిత్రాలతో వస్త్రాలను రూపొందించి వెల్ది హరిప్రసాద్ విశేష ప్రతిభ కనబరుస్తున్నారు.
హరిప్రసాద్ తయారు చేసిన పీతాంబరం, అగ్గిపెట్టెలో పట్టే చీరలను జిల్లా కలెక్టర్ పరిశీలించి, వాటి తయారీ విధానం, ఒక్కో చీర తయారీకి పట్టే సమయం, ముడిసరుకు, పెట్టుబడి తదితర అంశాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వెల్ది హరిప్రసాద్ చేనేత రంగంలో చూపుతున్న నైపుణ్యం చేనేత, వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన తన కళతో సిరిసిల్ల చేనేత ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేసి సిరిసిల్లకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే చేనేత ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ను రూపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

