* తలుపునూరులో అఖిలపక్ష నాయకుల అక్రమ అరెస్ట్
* తీవ్రంగా ఖండించిన జిల్లా సాధన కమిటీ
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: తమ గ్రామాన్ని నాగర్కర్నూల్ జిల్లాలోనే కొనసాగించాలంటూ తలుపునూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీక్షా ప్రాంగణంలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న సుమారు 10 మంది గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అధికార పక్ష నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని జిల్లా సాధన కమిటీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 4 వేల ఎకరాల భూభాగం, 2 వేల పైచిలుక ఓటర్లు ఉన్న తలుపునూరు ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాల పరంగా నాగర్కర్నూల్ జిల్లానే అత్యంత సమీపంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ స్వార్థం కోసం ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇస్తూ గ్రామానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా హక్కుల కోసం పోరాడుతున్న వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని, అరెస్టయిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

