* 100 అడుగుల మేర రహదారుల విస్తరణకు ప్రతిపాదనలు
* అఖిలపక్ష సమావేశంలో ఆర్డీవో సరిత వెల్లడి
ప్రజనావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: షాద్‌నగర్ పట్టణంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యగా మారిన ప్రధాన చౌరస్తా విస్తరణకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. చౌరస్తాను 100 అడుగుల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆర్డీవో ఎన్.ఆర్. సరిత తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు ఉండటంతో ఫ్రీ లెఫ్ట్ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. విగ్రహాలను గౌరవప్రదంగా మరోచోటికి తరలించి,విస్తరణ అనంతరం ప్రజల డిమాండ్ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆక్రమణలు తొలగించి, ఆర్‌అండ్‌బీ,విద్యుత్ శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, కమిషనర్ సునీతారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

