హైదరాబాద్: తెలంగాణలో సామాజిక న్యాయం సాధించగల నాయకత్వం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితదేనని ప్రజలు విశ్వసిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఇస్మాయిల్ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
గురువారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ” ఘనవిజయం సాధించిందని తెలిపారు. సభలో కవిత చేసిన ప్రసంగం సామాజిక న్యాయం, బీసీల సాధికారత, అన్ని వర్గాలకు సమాన అవకాశాలపై ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసిందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసాయని ఆరోపించిన వారు, సామాజిక న్యాయంపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తున్న నాయకురాలు కవిత మాత్రమేనని పేర్కొన్నారు. సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కవిత నాయకత్వంలోనే సామాజిక న్యాయం సాధ్యం: రూప్ సింగ్
ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని ఆచరణలోకి తీసుకురాగల నాయకత్వం కవితదేనని రూప్ సింగ్ అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించని స్థాయిలో సామాజిక న్యాయ తెలంగాణ సభను విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే తన సంకల్పాన్ని కవిత సభ ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలియజేశారని పేర్కొన్నారు.
సభ అనంతరం సామాజిక న్యాయ తెలంగాణకు కవితే రథసారథిగా ఉండాలనే అభిప్రాయం ప్రజల్లో బలపడిందని ఆయన అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇది ఆరంభం మాత్రమే: ఇస్మాయిల్
సామాజిక న్యాయ తెలంగాణ సాధనలో ఈ సభ తొలి అడుగు మాత్రమేనని ఇస్మాయిల్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా కార్యక్రమాలతో కవిత ముందుకు వస్తారని తెలిపారు.
సభను అడ్డుకునేందుకు, విమర్శలతో దారి మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలకు కవిత తన ప్రసంగంతో సమాధానం ఇచ్చారని అన్నారు. సామాజిక న్యాయం కోసం చేసిన తీర్మానాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు ఉద్యమకారులు, అమరవీరుల ఆశయాలను విస్మరించాయని విమర్శించిన ఆయన, మారోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కవిత ముందుకు తీసుకెళ్తారనే విశ్వాసం ప్రజల్లో ఏర్పడిందన్నారు. సామాజిక తెలంగాణ సాధనపై కవితకు ఉన్న చిత్తశుద్ధి సభ ద్వారా స్పష్టమైందని చెప్పారు.ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నేత రవిచంద్ర కూడా పాల్గొన్నారు.

