Friday, July 31, 2026

Buy now

సింగరేణి అనుబంధ ఆప్మెల్‌లో ‘సోలార్’ శకం ప్రారంభం

హైదరాబాద్,జూలై 29: సింగరేణి అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఆప్మెల్)లో ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అదే సందర్భంగా ప్లాంట్‌లో కొత్తగా నిర్మించిన సీసీ, ఆర్‌సీసీ రోడ్లను కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో ఆప్మెల్‌ను బహుముఖంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్వర్ణోత్సవ సంవత్సరంలో అడుగుపెట్టిన సంస్థ 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా రూ.63.13 కోట్ల టర్నోవర్, రూ.23.33 కోట్ల నికర లాభం నమోదు చేయడం అభినందనీయమన్నారు.

రూ.1.24 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు రూ.24 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని, ఐదేళ్లలో పెట్టుబడి తిరిగి వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వ్యాపార విస్తరణ చేపట్టాలని, సింగరేణి నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఆప్మెల్ ఛైర్మన్ ఎన్‌వికె శ్రీనివాస్ మాట్లాడుతూ, సింగరేణి, కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ సంస్థల నుంచి వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేశామని, సంస్థ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, విజయవాడ ఆప్మెల్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular