కొత్తగూడెం:సింగరేణి రెండో విడత ‘బాయిబాట’కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కొత్తగూడెంలోని పీవీకే-5 గనిని సందర్శించారు. గనిలోకి దిగి కార్మికులతో మాట్లాడిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సింగరేణి కార్మికుల హక్కులు, మెడికల్ బోర్డులు, డిపెండెంట్ ఉద్యోగాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.
కార్మికుల కోసం నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డులు నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించిందని, అందులోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. మెడికల్ బోర్డుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల 20 నుంచి నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
సింగరేణికి నిజాం ఇచ్చిన 17 గనుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక్క గనినే తిరిగి ఇచ్చిందని, మిగిలిన 16 గనులు కూడా సింగరేణికి అప్పగించే వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత పేర్కొన్నారు. సింగరేణి హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటులో సింగరేణి కార్మికుల త్యాగాలు కీలకమని గుర్తుచేసిన ఆమె, తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేశామని చెప్పారు. ప్రస్తుతం కార్మికుల హక్కులు క్రమంగా హరించబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణిలో కార్మికులకు అందిస్తున్న బూట్లు, గ్లౌజులు నాసిరకంగా ఉన్నాయని, తాగునీరు, సరైన గాలి వంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎక్కువ గంటలు పనిచేయించడం అన్యాయమని విమర్శించారు. అధికారులు కార్మికులను గౌరవంగా చూడాలని, వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరిచిందని ఆరోపించిన కవిత, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి కార్మికుల ప్రయోజనాలకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయించాలని కోరారు. కార్మికులు తమ హక్కుల కోసం భయపడకుండా పోరాడాలని, ధర్మం తమవైపు ఉన్నప్పుడు ఎవరినీ భయపడాల్సిన అవసరం లేదని ఆమె పిలుపునిచ్చారు.

