* “మా ఉద్యోగాలు మాకు వెంటనే ఇవ్వాలి”.. భిక్షాటన దీక్షతో నిరసన
సింగరేణి:సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ నేతృత్వంలో ఈ ఆందోళన కొనసాగుతోంది.
రెండో రోజు నిరసనలో భాగంగా బాధితులు భిక్షాటన దీక్ష చేపట్టి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. “మా ఉద్యోగాలు మాకు వెంటనే ఇవ్వాలి” అంటూ సింగరేణి యాజమాన్యం, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.
బాధితుల ఆందోళనకు హెచ్ఎంఎస్ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మారుపేర్ల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బాధితులకు అండగా ఉంటామని హెచ్ఎంఎస్ నాయకులు స్పష్టం చేశారు. బాధితులు చేపట్టే ప్రతి ధర్నా, పోరాట కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎప్పటి నుంచో మారుపేర్ల బాధితులకు సలహాలు, సూచనలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ సైతం బాధితులకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ **ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ అరెల్లి పోషం, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, బ్రాంచ్ సెక్రటరీ పీ. క్రాంతికుమార్, టూ-ఏ పిట్ సెక్రటరీ సంపత్** తదితర నాయకులు పాల్గొని నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు.మారుపేర్ల బాధితుల ఉద్యోగ సమస్యను తక్షణమే పరిష్కరించి, తమ ఉద్యోగాలు తమకు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

