హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్‌లో 200 ఆలయ కమిటీలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపు రూ.కోటి విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పద్మారావు, బీఆర్ఎస్ నేతల తీరుపై ఆయన విమర్శలు చేశారు. దైవ కార్యంలో కూడా రాజకీయాలు చేయడం తగదని అన్నారు. అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ కావాలనే ఆలస్యంగా వచ్చి కార్యక్రమంలో గొడవలు సృష్టించడం సరికాదని పేర్కొన్నారు.
సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు కార్యకర్తలను రెచ్చగొట్టి ఓ దైవ కార్యక్రమాన్ని రచ్చ చేయడం సరైన పద్ధతి కాదని బల్మూర్ వెంకట్ విమర్శించారు. ప్రజా ప్రభుత్వానికి రాజకీయ పార్టీల కంటే ప్రజలే ముఖ్యమని, గత పాలకుల మాదిరిగా తమ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు.

