సిద్దిపేట: జిల్లా కలెక్టర్ హైమావతి అధ్యక్షతన జరిగిన సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే హరీష్‌రావుతో కలిసి ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో రూ.5.49 కోట్ల వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఆమోదం తెలిపింది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో పేర్కొన్నారు.
ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్యాలియేటివ్ కేర్, పిల్లల ఆరోగ్య పరీక్షలు, కీమోథెరపీ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనవసరంగా సీ-సెక్షన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, పోషకాహారం, అవసరమైన అన్ని వైద్య పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం “తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి” సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

