సిరిసిల్ల: తెలంగాణ సిద్ధాంతకర్త “ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్” జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆధ్వర్యంలో అధికారులు, పోలీసు సిబ్బంది కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు వివరించి ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు.
ప్రొఫెసర్ జయశంకర్ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పోలీసు శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ మొగిలి, ఆర్‌ఐలు సురేష్,రమేష్,ఏఓ,ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, కార్యాలయ సూపరింటెండెంట్లు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

