Friday, August 7, 2026

Buy now

సిరిసిల్ల పోలీసుల పనితీరుపై డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ప్రశంసలు.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు సూచనలు

సిరిసిల్ల: రాజన్న జోన్-3 డీఐజీ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆయనకు స్వాగతం పలకగా, అనంతరం డీఐజీ గౌరవ వందనం స్వీకరించారు.

పోలీసు కార్యాలయ పరిసరాలు, స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్‌బీ) విభాగాలను పరిశీలించిన డీఐజీ, రికార్డుల నిర్వహణ, డిజిటల్ డేటా నిర్వహణ, సాంకేతిక వినియోగంపై ఆరా తీశారు. సిరిసిల్ల జిల్లా పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు.

అనంతరం జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజా భద్రత, దర్యాప్తు ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సైబర్ నేరాల నివారణ, పెండింగ్ కేసుల పురోగతి, కమ్యూనిటీ పోలీసింగ్, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, నేర నియంత్రణ చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు.

డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత చేరువయ్యేలా పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీసింగ్ అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై సత్వర స్పందనతో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, దొంగతనం కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి త్వరితగతిన ఛేదించాలని సూచించారు.

జిల్లాలో కన్విక్షన్ రేటు మెరుగ్గా ఉండటం అభినందనీయమని పేర్కొన్న ఆయన, కోర్టు మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేసి సాక్షులు విచారణకు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, “నేను సైతం” కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కనీసం 5 నుంచి 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

వాహనాల తనిఖీల సమయంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులకు అవగాహన కల్పించి వాటిని చెల్లించేలా ప్రోత్సహించాలని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే ప్రతి కేసును సీసీటీఎన్‌ఎస్ (CCTNS)లో నిర్ణీత సమయంలో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు.

గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ఉక్కుపాదం మోపాలని, వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైతే డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న కేసుల ఉపసంహరణ అవకాశాలపై కూడా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

అనంతరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది వినియోగార్థం ఏర్పాటు చేసిన నూతన తాగునీటి వాటర్ ప్లాంట్‌ను డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ప్రారంభించారు.ఈ సమావేశంలో డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular