* ఈ నెల 15న సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
* సభాస్థలి, హెలిప్యాడ్‌ను పరిశీలించిన జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డిలో అధికారికంగా ప్రారంభించనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను, అంబేద్కర్ స్టేడియంలోని బహిరంగ సభా స్థలాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులను, కార్యక్రమ నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు అరకొరగానే రేషన్ కార్డులు అందాయని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా కోటి 5 లక్షల మందికి నూతన స్మార్ట్ రేషన్ కార్డులు అందించబోతున్నామని తెలిపారు.
నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి నిర్ణయం తీసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఇది ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సంగారెడ్డి గడ్డపై ఘన స్వాగతం పలుకుతామని జగ్గారెడ్డి తెలిపారు. సుమారు 50 వేల మందితో జనసమీకరణ చేపట్టి బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

