Sunday, October 4, 2026

Buy now

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి:జిల్లా ఎస్పీ జానకి

​● పోలీస్ ప్రధాన కార్యాలయంలో సైబర్ వారియర్స్‌కు ప్రత్యేక శిక్షణ
● ​వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశం

ఉమ్మడి ​మహబూబ్‌నగర్ బ్యూరో: సైబర్ నేరాల పట్ల ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉంటూ, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వేగంగా దర్యాప్తు జరపాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని సైబర్ వారియర్స్‌కు ప్రత్యక్షంగా, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, NCRP పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ గిరి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో వివరించారు.

​ఆన్‌లైన్ ఆర్థిక మోసాల్లో పోయిన నగదును వీలైనంత త్వరగా రికవరీ చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. గ్రీవెన్స్ రీడ్రెస్సల్, మనీ రెస్టోరేషన్ మోడ్యూల్స్, సమన్వయ పోర్టల్ వినియోగం, ఎన్‌సిఆర్‌పి ఫిర్యాదులపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

ప్రజలు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, నకిలీ పెట్టుబడి లింకులు, ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, కేవైసీ అప్‌డేట్ వంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని ఎస్పీ కోరారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎస్సై శ్రావణ్ కుమార్, ఐటీ సెల్ ఎస్సై రవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular