* విద్యార్థులకు షీ టీమ్ అవగాహన.. మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు
మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్మిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మహిళలు, బాలికల భద్రత కోసం అందిస్తున్న సేవలు, షీ టీమ్ విధులు, లక్ష్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు లేదా ఇబ్బందులు ఎదుర్కొన్నా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
అదేవిధంగా సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు, అనుమానాస్పద మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు.
విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వాటి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలను తెలుసుకోవాలని షీ టీమ్ సిబ్బంది తెలిపారు. రహదారులపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రహదారి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
విద్యార్థులు లేదా మహిళలు ఎలాంటి ఆపద, వేధింపులు లేదా సమస్యను ఎదుర్కొన్నా వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ వాట్సాప్ నంబర్ 8712659385ను సంప్రదించాలని సూచించారు. ఈ నంబర్లను విద్యార్థులు తమ ఫోన్లలో సేవ్ చేసుకోవడంతో పాటు, అవసరమైన వారికి కూడా తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు వనిత, సతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజ వర్మ, వ్యాయామ ఉపాధ్యాయురాలు వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

