Tuesday, July 21, 2026

Buy now

హింసాత్మకంగా సీజేపీ ‘సంసద్‌ చలో’

– 118 మంది పోలీసులు, 60 మంది ఆందోళనకారులకు గాయాలు
– గాయపడినవారిలో పలువురు ఉన్నతాధికారులకు
– పోలీసులపై రాళ్ల దాడి, ప్రభుత్వ వాహనాల ధ్వంసం
– 70 మందిపై కేసు నమోదు

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన ‘సంసద్‌ చలో’ నిరసన కార్యక్రమం సోమవారం ఢిల్లీలో ఉద్రిక్తంగా మారింది. ఆందోళన హింసాత్మకంగా మారడంతో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురు ఉన్నతాధికారులు, మహిళా పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి సుమారు 70 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. న్యూఢిల్లీ ప్రాంతంలో జరిగిన ఈ నిరసన సందర్భంగా ఆందోళనకారులు పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని పోలీసులు ఆరోపించారు. ఆందోళనకారులు బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పిందని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు, ఇతర వస్తువులతో దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఆందోళనలో ప్రత్యేక పోలీసు కమిషనర్‌, జాయింట్‌ కమిషనర్‌, అదనపు కమిషనర్‌, డీసీపీ, అదనపు డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణలో సుమారు 60 మంది ఆందోళనకారులు కూడా గాయపడినట్లు వెల్లడించారు. గాయపడిన పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనల్లో 15 నుంచి 20 వరకు ప్రభుత్వ వాహనాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు శాంతిభద్రతలకు ముప్పు కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. అదుపులోకి తీసుకున్న 70 మంది ఆందోళనకారులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)తో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular