* మరణించిన హోంగార్డ్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెక్కు అందజేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
వరంగల్: విధి నిర్వహణలో ఉండగా ఆకస్మికంగా మరణించిన హోంగార్డ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అందజేశారు.
రాష్ట్ర పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందిస్తున్న హోంగార్డులు ఆకస్మికంగా లేదా ప్రమాదాల్లో మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల మేరకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు.
దుగ్గొండి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తూ గత ఏడాది ఆకస్మికంగా మరణించిన పి. శ్రీనివాస్ రెడ్డి భార్యకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ శ్రీనివాస్, హోంగార్డ్స్ ఆర్‌ఐ చంద్రశేఖర్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

