పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎస్సీ, ప్రభుత్వ కళాశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన 17 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల అవివాహిత బాలికలకు 6 నెలల “ఎయిర్ హోస్టెస్ – ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్” శిక్షణ అందించనున్నట్లు జిల్లా యువజన & క్రీడల శాఖ అధికారి ఎ. సురేశ్ తెలిపారు.
శిక్షణ మొత్తం ఫీజు రూ.1,42,000 కాగా, ఇందులో అభ్యర్థులు హాస్టల్ ఫీజుగా నెలకు రూ.5,500 చొప్పున 6 నెలలకు మొత్తం రూ.33,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.1,09,000 శిక్షణ ఫీజును పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భరిస్తారని పేర్కొన్నారు.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులకు విమానాశ్రయాల్లో “Passenger Service Assistant (PSA), Baggage Handling Service (BHS), Digi Buddy” తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం రూ.14,000 నుంచి రూ.25,000 వరకు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన & క్రీడల శాఖ అధికారి ఎ. సురేశ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) కల్పన విజ్ఞప్తి చేశారు.

