Saturday, August 15, 2026

Buy now

170 నిమిషాల్లో చీర నేసి.. అగ్గిపెట్టెలో పెట్టి సంచలనం సృష్టించిన సిరిసిల్ల నేతన్న

సిరిసిల్ల: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేలా సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సంప్రదాయ చేనేత మగ్గంపైనే కేవలం 170 నిమిషాల్లో (2 గంటల 50 నిమిషాలు)పూర్తి చీరను నేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సాధారణంగా ఒక చేనేత చీర నేయడానికి దాదాపు ఒక రోజు సమయం పట్టే పరిస్థితిలో, హరిప్రసాద్ అత్యంత వేగంగా చీరను నేసి తన నైపుణ్యాన్ని నిరూపించారు. అంతేకాకుండా తాను నేసిన 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు, 175 గ్రాముల బరువున్న చీరను ప్రత్యేక పద్ధతిలో మడిచి, ప్రముఖుల సమక్షంలో సాధారణ అగ్గిపెట్టెలో ఉంచి ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఈ చీర తయారీలో సుమారు 10,500 వెఫ్ట్ (Weft) పోగులు మరియు 1,500 వార్ప్ (Warp) పోగులు ఉపయోగించారు. మరమగ్గం వేగానికి ఏమాత్రం తీసిపోకుండా సంప్రదాయ చేనేత మగ్గంపైనే ఈ అరుదైన ఘనత సాధించడం చేనేత రంగంలో విశేష చర్చనీయాంశంగా మారింది.

హరిప్రసాద్ సాధించిన ఈ విజయాన్ని చేనేత కార్మికుల నైపుణ్యం, ఓర్పు, అంకితభావానికి నిదర్శనంగా పలువురు ప్రముఖులు అభినందించారు. ఆయన వినూత్న ప్రదర్శన “గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్” వంటి అంతర్జాతీయ రికార్డు గ్రంథాల్లో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు.సిరిసిల్ల చేనేతకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో వెల్ది హరిప్రసాద్ చేసిన ఈ అరుదైన ప్రయత్నం చేనేత రంగానికి కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్థానికులు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

spot_img

Most Popular